Tuesday, August 25, 2020

గుత్తి


          7వ శతాబ్దం నుంచి చారిత్రకంగా ఏర్పడిన గుత్తి 15°N77°381/15.12, 77.63 అక్షాంశాలు
రేఖాంశాల మధ్య భౌగోళికంగా ఉంది. సముద్రమట్టానికి 345మీ(1131 అడుగులు) మధ్యలో గుత్తి ఉంది. 
        గతంలో గౌతమపురిగా పిలువబడిన గుత్తిగా మారింది. అశోకుని పాలనలో గుత్తి ఉండేది. దీనికి గుర్తుగా ఒక బౌద్ధస్థూపం గుత్తికి సమీపంలో ఉంది. 

        ఇది అనంతపురం నుండి 51 కి.మీ.ల దూరంలో ఉంది.ముంబై చెన్నై రైల్వే రూట్ లో గుత్తి రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ డీజల్ షెడ్ ఉంది. ఇక్కడ ఉండే డీజల్ ఇంజన్లకు “ఆటో ఎమర్జన్సీ బ్రేకులు" ఉంటాయి. ఇవి నైరుతి రైల్వేలోని భాగంగా ఘాట్ సెక్షన్లో ఇలాంటి ఇంజన్లను ఉపయోగి స్తుంటారు.
     గుత్తి బెంగుళూరు, హైదరాబాదు జాతీయ రహదారి నంబరు NH7 పై ఉంది.

      లెక్కల ప్రకారం 2001గుత్తి జనాభా - 43,387. పురుషులు - 51%, స్త్రీలు - 49% సగటు అక్షరాస్యత 65%. పురుషులు - 74%, స్త్రీలు - 55%, 6సం||లోపు పిల్లలు 12%

              గుత్తి దుర్గం  చారిత్రక చిహ్నం గా పేరు గాంచింది. అలనాటి రతనాల సీమగా పిలువబడే నాటి రాయలసీమలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన గుత్తిలోని కట్టడం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దులో గుత్తి పట్టణానికి తూర్పుదిశలో 300 మీటర్ల ఎత్తున కొండలపై నిర్మించిన గుత్తి కోట శతాబ్దాల చరిత్రకు ప్రతీకగా విలసిల్లుతున్నది. 
కోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్లో ఉంది.

ఆంధ్రుల పరాక్రమవైభవానికి, శిల్పుల కళా కౌశలానికి మౌన సాక్షిగా నిలిచి ఉంది. మూడువైపులా కొండల మధ్యలో రాయలు నిర్మించిన పురాతన నగరాన్ని కలుపుకొని నిర్మించబడిన గుత్తి కోట నాటి చారిత్రక విశేషాలను నేటికీ గుర్తుకు తెస్తూ చూపరులను ఆకర్షిస్తోంది. 
గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలపించే విధంగా అయిదు మీటర్ల ఎత్తు, రెండున్నర మీటర్ల వెడల్పుతో బలిష్టమైన రాతికట్టడపు ప్రాకారాలలో లెక్కకు మించిన వృత్తాకారపు బురుజులతో 25 హెక్టార్ల విస్తీర్ణంలో కోటను నిర్మించారు.

 ఈ కోట నత్తగుల్ల/శంఖము/గవ్వ (షెల్ల్) ఆకారములో నిర్మించబడి 15 బురుజులతో, 15 ముఖద్వారాలు కలిగి ఉంది. కొండలు తక్కువ స్పర్‌ల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. కోట పశ్చిమ కొండపై ఉంది. ఇందులో రెండు భవనాలు ఉన్నాయి, ఒకటి ధాన్యాగారం కాగా, రెండోది గన్‌పౌడర్ నిల్వ. శిథిలమైన నరసింహ ఆలయం శిఖరం దగ్గర ఉంది. వ్యాయామశాల ఒకటి ఉంది. 


300 మీటర్ల ఎత్తైన కొండపైన " మురారీరావు గద్దె" అనే ఒక చిన్న పెవిలియన్ ఉంది. ఇక్కడి నుండి గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. మరాఠా జనరల్ మురారీ రావు ఇక్కడ చదరంగం ఆడేవాడు.

దిగువ కోటలు ప్రాకారాల శ్రేణిని కలిగి ఉంటాయి, ఇవి గేట్‌వేల ద్వారా అనుసంధానించబడి బురుజులతో ఉంటాయి . వర్షపునీటిని ఆపి నిల్వచేయడానికి రాళ్ళ పగుళ్ళలో గుంటలు తవ్వి అనేక జలాశయాలు చేసారు.కోట లోపల 108 బావులు తవ్వారు.


కోట లోపల అనేక శిథిలమైన భవనాలు ఉన్నాయి, వాటిలో ధాన్యాగారాలు, స్టోర్ రూములు, ఆయుధాగారాలూ ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఈస్ట్ఇండియాకంపెనీ అధికారి థామస్మన్రో, జైళ్లుగా ఉపయోగించారు .



        ప్రారంభంలోనే పెద్ద కందకం ఉంది. తర్వాత కోట ప్రారంభం అవుతుంది. దీన్ని దాటిన
తరువాత సింహద్వారం, నగరేశ్వర ఆలయం కనబడతాయి. దాదాపు మూడు ఫర్లాంగులు పురాతన నగరం ద్వారా వెళ్తే రెండో ద్వారం ఎదురవుతుంది. పైకి వెళ్లడానికి పదిహేను ముఖ ద్వారాలు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. మరో మార్గం లేదు. కిందనుంచి పైదాకా 50 అడుగుల వెడల్పుతో పెద్ద చిన్న గుళకరాళ్ళతో దారిని నిర్మించారు. పదాతి సైన్యం, అశ్విక సైన్యం ఈ దారి గుండా వెళ్ళేవి.
శతాబ్దాలు గడిచినా దారి చెక్కు చెదరలేదు. రెండో ద్వారం దాటితే పైకి వెళ్లగానే సైనికుల కవాతుకు ఉద్దేశించిన విశాలమైన మైదానం ఉంది. అక్కడే గజశాలలు, అశ్వశాలలు ఉన్నాయి.గుర్రాలు, ఏనుగులు నీళ్లు తాగటానికి పెద్ద బావి ఉంది. మరి కొన్ని ద్వారాలు దాటితే రాజోద్యుగుల
నివాస గృహాల అనవాళ్ళు కనిపిస్తాయి.
         

గుత్తికోట రహస్యం 

గుత్తికోటకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత సామాన్యమైనది కాదు. కాలం పుటలను వెనక్కు
తిప్పితే మెరసిపోయే గాథలు ఉన్నాయి.
        క్రీ.పూ. 2500-900 వరకు గుత్తి దుర్గంలో జన నివాసాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. రాతియుగం అవశేషాలు కొన్ని తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆనాటి మనుషులు ఉన్న గృహాలను బ్రిన్ పూల్ అనే బ్రిటీష్ పురాతత్వ శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆనాటిపనిముట్ల శిథిలాలు లత్తవరం, కరకముక్కల ప్రాంతాల్లో బయల్పడ్డాయి.
        క్రీ.పూ. 260 నుంచి  దీని విశేషాలు క్రమపద్ధదతిలో వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 220 నుంచి 200వరకు శాతవాహనులు పాలించినట్లు తెలుస్తోంది. అనంతరం బాదామి చాళుక్యులు, రాష్ట్ర కూటులు, పశ్చిమ గంగమ రాజులు, పశ్చిమ చాళుక్యులు పాలించారు.
          
గుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము, సంస్కృతములో ఉన్నాయి. అవి 7వ శతాబ్దము నాటివని అంచనా. ఒక శాసనములో ఈ కోట పేరు గదగా అని రాశారు. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనములో  దీనిని గుత్తి కోట దుర్గ రాజముగా చెప్పినారు.
       కోట గోడను 11,12వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తోంది. కోటలో కనిపించే సంస్కృత శ్లోకాన్ని బట్టి హరిహర బుక్కరాయులు గుత్తిని రాజధానిగా చేసుకొని పాలించినట్లు తెలుస్తోంది. బుక్కరాయల కాలంలోనే కోట శంకాకృతిని సంతరించుకుందని తెలుస్తోంది. విజయనగర రాజుల హయాంలో గుత్తి కోట గొప్ప వెలుగు వెలిగింది.
        గుత్తి కైఫియత్ ప్రకారము కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొన్నాడు. ఆ తరువాత ఇది కుతుబ్  షాహీ వంశస్థుల పాలనలో కి  వచ్చింది.1746 లో మురారి రావు ఆధ్వర్యములో మరాఠులు దీనిని జయించారు. 1775 లో హైదర్ అలీ గుత్తి కోటను తొమ్మిది నెలల నిర్భంధము తర్వాత వశపరచు కొన్నాడు.1779లో టిప్పుసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బ్రౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిషు వారి పాలనలోకి తెచ్చాడు.

No comments:

Post a Comment