Saturday, August 29, 2020

అనంత కరువుల చరిత్ర





           అనంతపురం జిల్లాలో ఏర్పడుతున్న   కరువులన్నీ నీరు లేక ఏర్పడుతున్నవే. గ్రామీణ ప్రాంతాలలో ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడినా వర్షం గురించిన ప్రస్తావన వస్తుంది. నీటి కరువు ఈనాటిదేం
కాదు. కరువులు జిల్లా ప్రజలకు వారసత్వ సంపదగా ఉన్నాయి. కరువు ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో విడదీయరాని భాగంగా మారిపోయింది. అందుకే కరువుల ప్రసక్తి లేకుండా అనంతపురం జిల్లా చరిత్ర ఉండదు. 
          చరిత్ర తెలిసినప్పటి నుంచి  నీటికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడి ఉంది. అందుకే నీటి కరువు నుంచి ఉపశమనం కలిగించడానికి గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.
           వీలయినచోటల్లా చెరువులు, కుంటలు తవ్వించారు. వర్షాలు ముఖం చాటేసినప్పుడు ఈ చెరువులు, కుంటలు కూడా ఎండిపోయేవి. మనకు తెలిసినంత వరకూ 1792-93 నుంచి 1942-43
వరకూ 18 తీవ్రమైన కరువులు ఈ ప్రాంతాన్ని పీడించాయి. 1833లో వచ్చిన కరువులో ప్రజలు
తిండి దొరకక చింత గింజల, కలబంద గుజ్జును తినేవారని అనంతపురం జిల్లా 1970-253
గెజిట్ లో పేర్కొన్నారు.
         1876లో దక్షిణ భారత దేశమంతా కరువు విస్తరించింది. దానినే ధాతుకరుపు లేదా, డొక్కల కరువు అని అంటారు. తిండి లేక ప్రజలు, గడ్డి లేక పశువులు మృతిచెందితే వాటి శవాలు ఎక్కడ చూసినా కనపడేవంటారు. బ్రిటిష్ ప్రభుత్వం అన్నార్తుల కోసం కదిరి నరసింహస్వామి
దేవాలయంలో గంజి కేంద్రం ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కాలినడకన బారులు
కట్టిన వృద్ధులు, పసిపిల్లలు దారిలోనే పిట్టల్లాగా రాలిపోయినట్లు చరిత్ర చెబుతోంది. ఇంత తీవ్రమైన
పరిస్థితుల నుంచి సహాయక చర్యలు తీసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల స్థితిగతులు పరిశీలించడానికి 1898లో ఒకటి, 1901లో మరొకటి ఫ్యామిన్ కమిషన్లను ఏర్పాటు చేసింది.
        అనంతపురం జిల్లాలో కూడా పర్యటించిన కమీషన్  సహాయక చర్యలతో పాటు అనంతపురం జిల్లాలో తుంగభద్ర కాలువలను పొడిగించాలని సిఫారసు చేయడం జరిగింది. ఆనాటికి తుంగభద్ర ప్రాజెక్టు లేదు. నది మీద చిన్న చిన్న ఆనకట్టల ద్వారా బళ్ళారి, రాయచూరు ప్రాంతాలకు కాలువల ద్వారా నీటిని మళ్లించేవారు. అట్లాగే ఈ ప్రాంతంలో జరుగుతున్న సహాయక చర్యల స్థాయిని కూడా పరిశీలించి తమ అసంతృప్తిని వెల్లడించారు. మరింతగా సహాయక చర్యల్ని విస్తరించాలని నివేదికల ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ప్రాంతాల కంటే అనంతపురం జిల్లాలో కరువు తీవ్రత ఎక్కువగా ఉందని కూడా అభిప్రాయపడ్డారు.
           జిల్లా  రైతాంగాన్ని పీడిస్తున్న కరువు బారి నుంచి రక్షించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో పెద్ద ప్రయత్నాలే జరిగాయి. సాగునీటి పితామహుడు అయిన సర్ అర్ధర్ కాటన్ తుంగ్రభద్ర నది మీద ఒక ఆనకట్ట కట్టి ఈ ప్రాంతానికినీరందించా లని 1860లోనే ప్రణాళికల్ని రూపొందించారు.
గోదావరి నది మీద ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి ఉభయగోదావరి జిల్లాను సస్య శ్యామలంచేయాలని భావించిన మహాశయుడే ఈ కాటన్. ఈ ప్రాంతాన్ని కరువుల బారి నుంచి శాశ్వత విముక్తి కలిగించడానికి బ్రిటిష్ ప్రభుత్వపు ఆలోచనల నుంచి ఉద్భవించినదే ఈ తుంగభద్ర ప్రాజెక్టు. అందుకే కాటన్ 1864లో రాసిన "పబ్లిక్ వర్క్స్ ఇన్ ఇండియా"లో పలు విషయాలను వెల్లడించారు.
        బంగారం కంటే ఇండియాలో నీరు చాలా విలువైనవనంటాడు. నీటి విలువ తెలిసిన వారుకావడం చేతనే సాగునీటి వనరుల కల్పనకై పరితపించారు. నీరు ప్రకృతి సంపద. ఈ ప్రకృతి సంపదకు సరిహద్దులు లేవు. ఏ ప్రాంతపు ప్రజలకు నీరు అత్యంత అవసరం ఉంటుందో వారికిప్రాధాన్యతా క్రమంలో మొదటగా నీటిని అందించాల్సి ఉంటుంది. ఆ కారణంగానే తుంగభద్ర నది ద్వారా కరువు ప్రాంతాలకు నీటి వసతిని కల్పించారు. దాని తర్వాత జిల్లాలో 37 మండలాల ద్వారా సాగే పెన్నా నది దాని ఉపనదుల మీద చిన్నా చితకా ఆనకట్టలుగానే ఈ నాడు మిగిలిపోయి ఉన్నాయి.

No comments:

Post a Comment