Saturday, August 29, 2020

అనంతలో నీటిపారుదల రంగం



రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అనంతపురం జిల్లా, 19130 చదరపు కిలోమీటర్లు వైశాల్యం
కలిగింది. 27 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. మూడున్నర లక్షల ఎకరాలకు మాత్రమే
సాగునీటి వసతి ఉంది. అందులోనూ గాలిలో దీపంలాంటి భూగర్భ జలాల మీద ఆధారపడి
వుంది. అంటే 24లక్షల ఎకరాల్లో వర్షాధారం మీద ఆధారపడే రైతులు పంటలు సాగుచేస్తున్నారు.
జిల్లాలో సగటున పడే 550మిల్లీమీటర్ల వర్షపాతం కూడా సక్రమంగా నమోదవడం లేదు. దీంతో
తరచూ కరువులు ఏర్పడుతున్నాయి. గడిచిన 17 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు కరువొచ్చింది.
దాదాపు ప్రతి ఏటా  కరువే.
        అనంతపురం జిల్లాలో పెన్నార్ పరివాహక ప్రాంతంలో అప్పర్ పెన్నార్, మిడ్ పెన్నార్,పాపాగ్ని,
చిత్రావతి, తడకలేరు, కుందేరు, , సగిలేరు,చెయ్యేరు, లోయర్ పెన్నారు అని పదినదులున్నాయి.అయితే గడిచిన దశాబ్దకాలంలో చూస్తే వీటిల్లో నీరు ప్రవహించిన దాఖలాల్లేవు. 
          తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా వచ్చే 22 టిఎంసిలే జిల్లాకు ఏకైకా జలాధారంగా ఉంటోంది. అరకొరగా కురిసిన వర్షాలతో నిండే చెరువులు, కుంటలు, భూగర్భజలాలే జిల్లాకు సాగునీటి వనరుగా ఉంటున్నాయి.1972లో ఇరిగేషన్ కమీషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం 1000 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ భూమిలో కనీసం 30 శాతం భూమికి నమ్మకమైన సాగునీటిసౌకర్యం కల్పిస్తే తప్ప దుర్భిక్ష ప్రాంతాలకు మనుగడ లేదని స్పష్టంగా పేర్కొంది. అయితే అనంతపురం జిల్లాలో ఏటా కురిసే సగటు వర్షపాతం 550 మిల్లిమీటర్లు కూడా ఉండటం లేదు. ఈ అత్యల్ప
వర్షపాతం కూడా అపనమ్మకమైనదని ప్రతి ఏటా కురిసిన వర్షపాతాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
ఇక సాగునీటి వసతి అయినా ఉందా అంటే అదీ లేదు. మూడు లక్షల ఎకరాల్లోపే సాగునీటి
వసతి ఉంటోంది. జిల్లా మొత్తంగా 27 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే కేవలం మూడు లక్షలఎకరాల్లోపు భూమికే సాగునీటి వసతి ఉంది. అంటే పది శాతం లోపే సాగునీటి వసతి ఉందన్నదిస్పష్టమవుతోంది.

No comments:

Post a Comment