నేను పూలకుంటలో రౌద్రనామ సంవత్సరం భాద్రపద శుద్ధసప్తమి ఆదివారం అనగా 07-09-1920 న జన్మిం చినాను. 1934-35 లలో పసులూరు హరిజన ఎరికిలప్ప జిల్లాబోర్డు మెంబరు. ఖద్దరుధారి. పూల కుంట, చియ్యేడు , దుర్గం, మన్నీలలో ప్రచారం చేసేవారు. నేనూ,నా స్నేహితుడు మోదీన్ సాబూ ఖద్దరు టోపీలు పెట్టుకొనేవాళ్ళం. చియ్యేడు కల్లంగడి దగ్గరకు పోయి కల్లుతాగొద్దని పాటలు పాడేవారం. తాగుబోతులు ‘కల్లు’ మామింద పోసేవారు. ఎరికిలప్పను తన్నేవారు. ఎర్రమల కొండప్ప, పసలూరు ఎరికిలప్ప శిస్తు తగ్గించమని కలెక్టరు ఆఫీసుకు దగ్గరకు జనాలను పిలుచుకొని పోయేవారు. పూలకుంట నుండి జనాలు ఎక్కువమందిని కదిలించేవాళ్ళం.
ఎరికిలప్పగారు పూలకుంట వచ్చినపుడు నా యింట్లోనే భోజనము. ఆయనను యింట్లోకి పిలిచి భోజనం పెట్ట డానికి అమ్మకు యిష్టంలేదు. కాని నచ్చచెప్పంగా, చెప్పంగా భోజనం పెట్టడానికి మాత్రం అంగీకరించింది. మోదీన్ తండ్రిగారు పండితుడు. పాటలు రాసినాడు. కావ్యాలు రాసినాడు. “కాంగ్రెసువాళ్ళు చెప్పేది వినర” వంటి పాటలు రాసినాడు. “శ్రీ రాముడు తన రామను కారామము దప్పి వెదుక” ఇటువంటి మధురమైన పద్యాలతో రామాయణ కావ్యం రాసినాడు.
1936లో సదాశివన్, ఎరికిలప్పగార్లు మా గ్రామాలకు వచ్చేవారు. ‘కేశవ విద్యానికేతన్’ హరిజన హాస్టలుకు గింజలు వసూలుచేసేకి వచ్చేవారు. నేనూ, మోదీను వారి వెంట తిరిగి వడ్లు,రాగులు వసూలు చేసేవాళ్ళం. అపుడు ఎకరానికి 10 బస్తాలు పండేవి. బస్తా ధర రెండు రూపాయలు, రెండు ముప్పావలా( రు.02-75) వుండేది. చెనిక్కాయ ‘మణువు’ ఏడు అణాలు( 42 నయాపైసలు), బంగారు తులం రు,18/- వుండేది. కొనుగోలు శక్తి బాగా పడిపోయింది. అరవై, డెబ్బై శాతం కూలీలు పస్తులుంటున్నారు. ఒక పూట అడుక్కుతినేవారు. రైతులమీద ఆధారపడి వున్నారు. వూరిలో వీధిబడి వుండేది. నెలకు అర్ధ రూపాయి, రూపాయి యివ్వాలి. గ్రాంటు స్కూలు కూడా వుంది. నేనూ , గురప్ప, వసూలు చేసిన ధాన్యాన్ని గాడుదుల మీద హాస్టలుకు చేరవేసేవాళ్ళం. అపుడు సదాశివన్ గారు ముద్దా, పప్పూ పెట్టేవాడు. ఆయనా మా పక్కనే కూ ర్చొని అదే తినే వాడు. ‘ఏ దేశం పోదాం బాబూ, ఎంతదూర మాదేశం / ఆకలి లేదు,అప్పులు లేవు ఆ దేశం రష్యాదేశం “అని మానికొండ సత్యనారాయణ పాటను గ్రాంఫోను పెట్టి వినిపించేవాడు. అన్నా చెల్లెల పాట రష్యా దేశం గురించిన పాటలు వినిపించేవాడు.
సదాశివన్ గారు పూలకుంట బి.ఎ.నాగిరెడ్డి రాప్తాడు కింకిర వెంకటరెడ్డి, పరసన్నాయపల్లి వెన్న పూసల నాగి రెడ్డి, మన్నీల అల్లు మొరప్ప మొదలగు యువకులతో సంబంధాలు పెట్టుకొని క్యాడరును తయారు చేసినాడు. వారికి రాత్రి బస హాస్టలు. ఈ యువకులు స్వతంత్ర భారత్ ను పంచేవాళ్ళు. కాంగ్రెసు పార్టీలో వామపక్ష భావాలు గల వారిని తయారుచేయాల ని కొన్నిపుస్తకా లు యిచ్చేవారు. మాలపల్లి, విశ్వరూపం, కాంగ్రెసు చరిత్ర( పట్టాభి గారిది). అవి మేం పంచేవాళ్ళం. సదాశివన్ తోపాటు జి. రామకృష్ణ వచ్చేవాడు. అయన సాహిత్యం అందించేవాడు, చర్చలు చేసేవాడు.
1941 లో పూలకుంటలో 15 మంది సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వి.కె.కూడా మాతోపాటు పాల్గొన్నాడు. అర్గనైజరుగా సదాశివన్ గారు వచ్చినారు. పోలీసులు మమ్మల అరెస్టు చేయలేదు. నిరుత్సాహం కలిగింది. వి.కె. కథ ఎట్లంటే వి.కె.నే ముందుకు వచ్చి తనను అరెస్టు చేయమంటే చేయరు. పోలీసులు అరెస్టు చేస్తామని ముందుకు వచ్చిన కేసుల్లో అయన దొరకడు. ఈ సత్యాగ్ర హ సమయంలో నేనూ, కే. నరసింహారెడ్డి శింగనమల, ధర్మవరం యేరియాలో ఒక నెల రోజులు కాంగ్రెసు ప్రచారం చేసినాము.
నేను వడ్డేవాన్ని. మా వృత్తి రాళ్ళు కొట్టడం. 09-08-1942 న వులిసికొండల్లో రాళ్ళు కొట్టుకుంటూ వుంటే పోలీసులు జీపులో వచ్చి నన్ను అరెస్టు చేసినారు. అప్పటికే నరసింహారెడ్డి, గురప్ప, మోదీన్ సాబ్ లను అరెస్టు చేసినారు. మూడు నెలల యిరవై రోజులు సబ్ జైలులో ఉంచినారు రైల్వేపట్టాలు పీకేసినామని మాపై కేసు. సాక్షులు రాలేదు. కాంగ్రెసు పైన ఎట్లా చెప్పేదని? ఎవరూ సాక్ష్యం చెప్పలేదు. కేసు కొట్టేసినారు.
ఉప్పరపల్లి రెడ్డి బలమైనవాడు. ఆ వూరి కురువవాండ్లకు బలం చాలదు. భయపడి రెడ్లకు గొర్రెలు సమర్పించుకో వల్ల. నాయకులు అండర్ గ్రౌండ్ లో వున్నారు. రహస్యంగా రాప్తాడు గరండాల వద్ద వి.కె. సదాశివన్, తరిమెల నాగిరెడ్డి, నేనూ, సి.ముత్యాలప్ప సమావేశం అయి చర్చించినాము. రెవెన్యూ మంత్రి కళావెంకట్రావుకు మెమొరాండం యివ్వాలని నిర్ణయం. సంజీవులు, ముత్యాలప్ప కరపత్రం వేసినాము. గొర్రెలు,కుక్కలు జనాన్ని పిలుచుకొని సదాశివన్,జి.రామకృష్ణ, నేనూ, ముత్యాలప్ప, నరసింహారెడ్డి అనంతపురం దగ్గర మెమొరాండం యిచ్చినాము. రెడ్డిని బర్త్ రఫ్ చేసినారు.
1946- 47- 48 లో కరువు. పార్టీ పిలుపు మేరకు స్టోర్లు పెట్టాలని, స్టోర్లలో బండికమ్మలు అమ్మాలని, రంగూన్ బియ్యం సక్రమ పంపిణి చేయాలనీ పోరాటాలు చేసినాము. బ్లాక్ మార్కెట్ చేయకుండా చేసినాము. ప్రొక్యూర్ మెంట్ పెద్ద రైతుల దగ్గర మాత్రమే చేయాలనీ డిమాండు పెట్టాము.
ఆకుతోటపల్లిలో శిల్పం చెక్కుతావున్న నన్ను పోలీసులు అరెస్టు చేసి, డిటెన్యూగా కడలూరు జైల్లో పెట్టినారు. కడలూరు జైలు ఒక యూనివర్సిటీగా వుండేది. పెద్దవాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఎ.కె. గోపాలన్ వంటి వారు నిరంతరం క్లాసులు తీసుకొనేవారు.నెలకు 50/- లు అలవెన్సు యిచ్చేవారు. కమ్యూనిస్టుపార్టీకి రాజీనామా చేస్తే విడుదల చేస్తామని జైలు అధికారులు ఆశ పెట్టినారు. నాకు తెలిసి అట్లా ఆశపడినవారు ఒక్కరు లేరు. జైలులో చైనా డే జరిగింది. రణదివే నాయక త్వాన కడలూరు జైలుల్లో పోరాటం జరిగింది. తుపాకులతో పోలీసులు వస్తే, కట్టెలతో సి.పి.ఐ. ఎదురు దాడి చేసింది. జైలరు థామస్ 24గం. తాగుతాడు. ఎ.కె.గోపాలన్ కు థామస్ కు పడింది. ఎ.కె.గోపాలన్ జైలరు పిస్తోలు లాక్కున్నాడు. కాల్పులు జరిగినాయి. ఇద్ద రు చనిపోయారు. రామకృష్ణ, గజ్జల మల్లారెడ్డి. ముత్యాలప్ప, నేనూ కింద పడుకున్నాము. జైలరు పోయినా డా లేదా అని చూడ బోతే రవ్వ వచ్చి తగిలి కన్నుపోయింది జి. రామకృష్ణకు.
చియ్యేడు, పూలకుంటలో కౌలుదార్ల ఉద్యమం జరిగింది. పూలకుంట, దుర్గం, చియ్యేడు గ్రామాలలో దాదాపు 75 శాతానికి భూములు లేవు. అంతా కోరుకు చేసేవాళ్ళే. కపిల బావులు, చెరువుల కిందా సాగు.మూడింట రెండువంతులు కోరు దారుకు, ఒక వంతు భూస్వామికి ఉండేది. అన్నిఖర్చు లు కోరుదారే భరించాలి. మూడు గ్రామాల కోరు రైతులను, చిన్న రైతు లను కలిపి రాత్రిపూట మీటింగులు పెట్టినాము. నిర్ణయం మేరకు రైతులు,కోరుదారులు సమ్మె చేసినారు. భూములు బీడుపడి నాయి. భూములు బీడు పడుతానే పోలీసులు నా కోసం వెతకలాడబట్టిరి. ఆఖరుకు సబ్ కలెక్టరు, DSP, సి.ఐ.డి.ఇన్ స్పెక్టర్ పూలకుంటకు వచ్చినారు. “ ఏమండీ! మీ వూళ్ళో ఈ సమస్య వుంది. ఎందుకు ఘర్షణ పెట్టుకుంటారు? మా దగ్గరకు వస్తే మేము పరిష్కారం చేస్తాము కదా! సంజీవులు గారిని ఎక్కడున్నా పిలిపించండి. తొందరగా పరిష్కారం చేసి పోతాము.” అని నమ్మ బలికినారు మంచి మాటలతోనే. పూలకుంట బయట డెన్నులోనే వున్నాను. ఆ వూరిలో 90 శాతం అంతా పార్టీ అనుకూలురే. హానిచేసే వాళ్ళు ఒక్కరూ లేరు. పోలీసులు వచ్చినారంటే తక్షణం కామ్రేడ్స్ కు చేరవేసేవాళ్ళు జనాలు. ఒక వేళ డెన్నులో లేకుండా ఊర్లో వున్నా దగ్గరలో వున్న ఏ ఇంట్లో దూరైనా రక్షణ తీసుకోవచ్చు.ఆ రోజుల్లో పూలకుంట, కృష్ణమరెడ్డి పల్లి. ప్రసన్నాయపల్లి, సోదనపల్లి (మరింత బలమైన కేంద్రం) రహస్య కేంద్రాలు. నేను వద్దు,వద్దు, అన్నా వినకుండా నన్ను బయటకు తెచ్చినారు కామ్రేడ్స్. వి.కె. గారు వేరే తాలుకాలో వున్నారు. సమస్య పరిష్కారం కోసం కాదు, నన్ను అరెస్టు చేయ డానికే వచ్చినారు అని చెప్పినా వినలేదు. నువ్వు బయటకు వస్తే పరిష్కారం అవుతుందని డి.నాగిరెడ్డి, సత్తారు, కూరపాటి రామిరెడ్డి నన్ను బయటకు తెచ్చినారు. జనం ఎనిమిది వందలు దాకా వుంటారు. స్కూలు దగ్గరకు రాగానే రిజర్వ్ పోలీసులు చుట్టు ముట్టినారు. అపుడు మోసం తెలుసుకున్న జనం రాళ్ళతో, గుండ్లతో తిరగబడినారు. DSP నా దగ్గరకు వచ్చి, “సంజీ వులు గారు! చావాలనుకున్నారా? మీరు చస్తారు, మేము చస్తాం. దానివల్ల లాభం ఏమిటి?” అన్నాడు. జనాన్ని ఆపి, నమ స్కారం పెట్టి, అరెస్టు అయినాను.
కొరియర్ ద్వారా విషయం తెలుసుకొని రాత్రికి రాత్రే వి.కె.గారు వచ్చినారు. అరెస్టును ఖండిస్తూ ఒక కరపత్రం వేసి నాడు.( పూలకుంట సంజీవులు అరెస్టు, చియ్యేడులో పోలీసుల తందనాలు 08-04-1949 ) ఉద్యమం నడిపినాడు.చేండ్ల లో సమావేశాలు వేసి సమ్మె కొనసాగేటట్లు చేసినాడు. చివరకు భూస్వాములు డి.నాగిరెడ్డి, కూరపాటి రామిరెడ్డిలతో సంప్రదింపు లు జరిపి కోరుదార్లకు అనుకూలమైన ఒప్పందం చేసుకున్నారు.
నేను జైలునుంచి వచ్చిన తరువాత నన్ను కలుసుకోడానికి వీకే పూలకుంటకు మా యింటికి వచ్చినాడు. జైలు జీవితం గురింఛి విచారించిన తరువాత శివాయిజమా పోరాటాలు చేద్దామని మొదలు పెట్టినాడు “ ఇగో వి.కె.అన్నా! ఇంకా నెల కూడా కాలేదు. మల్లా పంపిచేతట్లు ఉండవే!’ అని నవ్వింది నా భార్య .“ తప్పదమ్మా యివన్నీ! ఈ సారి అట్లా జరగదులే. ఈయప్ప ఇంట్లో వుంటాడు. నేను జైలుకు పోతా” అన్నాడు వీకే. పూలకుంటలో ధనిక రైతుల ఆధీనంలో వున్న 290 ఎకరా లు పంచల్ల అని ప్లాన్ వేసినాం. ఆ ధనిక రైతులు తమ చేండ్లకు ఆనుకొనివున్న కొండలు, గుట్టలు, గొందులు అన్నీ ‘ మావే అంటారు. పసలోన్నీ రానీరు, గోర్లోన్నీ రానీరు. పట్టపగలే ఆక్రమించినాం. దగ్గర దగ్గర 40 కాండ్లతో మడకలు కట్టించి. ఎర్రజండాలు కట్టించి, తప్పెట్లతోమ్యాలాలతో ఆభూములు ఆక్రమించినాం. భూస్వాములు రాలేకపోయిరి. ఇది 1951 నాటి మాట. అంటే శివాయిజమా చట్టం రాకముందే పార్టీ అమలు పరచిన చట్టం. భూస్వాములు బహిరంగంగా పార్టీని ఎదిరించ లేక రహస్యంగా పోలీసులకు రిపోర్టులు పంపేవారు. అట్లా పంపేవాళ్ళ లో ఒక పొగరుబోతును గుర్తించినారు కామ్రేడ్స్. అత న్ని దారి కాచి కొట్టినారు కామ్రేడ్స్. సంజీవులు, వి.కె. అండర్ గ్రౌండులో వున్నారు. డి.నాగిరెడ్డి, సత్తారు, ఓబులే సు, ఆ పని చేసినారు. “ యిప్పుడు ప్రాణాలతో వదలుతున్నాం. ఈ సారి ప్రాణాలు తీస్తాం.” అని హెచ్చరించినారు. భయపడి పోయి ఇక మీదట పంపము అని అగ్రిమెంటు చేసుకున్నారు. ఆ రోజుల్లో యిట్లా కట్టడి చేయకపోతే మేము తిరగటం ఇబ్బంది, ప్రజాకా ర్యక్రమాలు చేయడం ఇబ్బంది. ఆ తరువాత భూఆక్రమణ కొనసాగింది. రిజిస్టర్లు లేవు, పట్టాలు లేవు. ఆక్రమించిన వాళ్ళే తాడుతో కొలతలేసుకొని, ఒద్దికతో, ఒప్పుదలతో మేరలు నిర్ణయించుకున్నారు, వారంటు ఉండడం తో నేను అజ్ఞా తంగా వున్నాను. పోలీసులు వచ్చి నాయిల్లు, సత్తార్ యిండ్లు పడగొట్టినారు. భార్యా, యిద్దరు పిల్లలను వీకే సురక్షిత ప్రాంతంలో పెట్టినాడు. నేను నరిసినేకుంటలోచిక్కినాను. సబ్ జైలులో వేసినారు.“ నిన్ను డిటెన్యూగా మల్ల జైలుకు పంపుతాము. నువ్వు చాలా దుర్మార్గంగా వున్నావు. విదిచిపెట్టేస్తే మళ్ళా ఉద్యమాలు నడుపుతావా?” అని DSP అన్నాడు. . ‘ అనంతపురం విడిచి ఎక్కడకు పోకూడదు. పల్లెలకు పోకూడదు. పల్లెలో చిక్కితివా, చిక్కినచోటే కాల్చిపారేస్తా , ప్రతిరోజూ కనపడల్ల, రిపోర్టు చేయల్ల’ అన్నాడు. దానికి నేను అంగీ కరించలేదు. నేను స్టేషనుకు వచ్చి రోజూ కనపడటం సాధ్యం కాదు.మీరేం చేసుకుంటా రో చేసుకోండి అన్నాను.
నరసనేకుంటలో భార్యను,పిల్లలను, నాయన్ను పెట్టి రాత్రిపూట వి.కె.తో కలుసుకొని పల్లెలెంబడి తిరిగేవాన్ని. పోలీసుల కేమంటే నాకు వ్యతిరేకంగా పల్లెనుండి రిపోర్టు పోగూడదు అంతే.
1952 ఎన్నికలలో వి.కె.గారితో పాటు ప్రచారానికి తిరిగినాను. మాకు అనంతపురం, నార్పల ప్రాంతాలు కేటా యించినారు.. నెహ్రు వచ్చినారు. లక్షమందితో బహింగసభ జరిగింది. సంజీవరెడ్డి దుర్మార్గాలు, కాంగ్రెసు దుర్మార్గాల మీద పార్టీ కరపత్రం వేసింది. యింతమంది జనాలు వచ్చినారు. నేను తప్పక గెలుస్తా ను, నాగిరెడ్డి ఓడిపోతాడు, ఓడిపోతాడు అన్నా డు సంజీవరెడ్డి. ఆ సభలో వున్న కామ్రేడ్స్.“ మీరు తప్పకుండా ఓడిపోతారు. నాగిరెడ్డి గారు తప్పక గెలుస్తాడు. గెలుస్తాడు’ అని గట్టిగా అరచినారు. ఈ ఎన్నికలలో సంజీవరెడ్డిగారు ఓడిపొయినారు. నాగిరెడ్డి గారు గెలిచినారు.
రహస్య దినాల్లో కామ్రేడ్స్ కలుసుకొనేది కొండల్లోనే. రాత్రి పూట పడుకొనేది అక్కడనే. దుర్గం, చియ్యేడు కొండ ల్లో పూలకుంట, చియ్యేడు కామ్రేడ్స్ వుండేవారు. వి.కె.గారి వెంట నేను పల్లెలు తిరుగుకుంటూ ఆ కొండల్లో చేరేవాళ్ళం. వి.కె. గారికి ఈ కామ్రేడ్స్ అంటే చాలా ప్రేమ. ఒక ఉదాహరణ చెప్తా --- మీరంతా నిద్ర పోండి. తెల్లార్లు నేను సెంట్రి డ్యూటీ చేస్తా అనేవాడు. తెల్లార్లు నిద్రపోడు. మేలుకొనే వుంటాడు. మేము ఎపుడన్నా వంతులవారి గంటకొకరో, రెండు గంటల కొకరో డ్యూటీ చేసేవాళ్ళం. దుర్గం కొండల్లో దేవలాలు, సత్రాలు వున్నాయి. అక్కడ తరగతులు నిర్వహించారు. సదాశివన్ గారు, వీకే గారు తరగతులు బోధించినారు. ప్రజలు మాకు అన్ని సౌకర్యాలూ అందజేస్తారు. కాఫీలు, టిఫెన్లు, భోజనాలు అన్నీ రహ స్యంగానే అందజేసేవారు. సదాశివన్ గారితో పెద్ద సమస్య. సిగరెట్టు గాని, బీడి గాని తాగనీడు. కంబడి కప్పుకొని తాగుతామ ని అన్నా సదాశివన్ గారు ఒప్పుకోనే ఒప్పుకోరు. పరసన్నాయపల్లె, క్రిష్ణమరెడ్డి పల్లి, చియ్యేడు, పూలకుంట కామ్రేడ్స్ ఈ తర గతులకు హాజరైనారు. తరిమెల యేరియా గంపమల్లయ్య కొండల్లో కూడా ఇట్లాంటి తరగతులు నిర్వహించి నారు. అక్కడ వి.కె.గారు, నాగిరెడ్డి గారు తరగతులు బోధించినారు. ఇక్కడి నుండి డి.నాగిరెడ్డి, చియ్యేడు కృష్ణారెడ్డి ఆ తరగ లకు హాజరై నారు.“రహస్య రోజుల్లో కామ్రేడ్స్ కు ఏమీబాధలు కలగకూడదు. అవి ఏమన్నా వుంటే నేనే భరిస్తాను” అనేది వి.కె గారి .వైఖరి. జాగ్రత్తగా చూసేవాడు.
1952 ఎన్నికల తరువాత అనంతపురం తాలుకాలో రాజశేఖరరెడ్డి నాయకత్వం వహించినాడు. పెద్ద పోరాటాలు జరిగినాయి. కళ్యాణదుర్గం, కూడేరు మండలం, అనంతపురం తాలుకాలో పెద్దపోరాటాలు జరిగినాయి. నేను, చలిచీమల ముత్యాలప్ప,రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన గార్లదిన్నె మండలం బూదేడులో గుర్రం నారాయణప్ప గారి 500 ఎకరాలు ఆక్రమణ చేపట్టినాము. ఆయన పెద్ద భూస్వామి. మంది, మార్బలాన్ని తెచ్చినాడు. సారాయి డబ్బాలు దించినాడు. రాజశేఖర రెడ్డి మా నాయకుడు. కొండాపురం సుంకిరెడ్డి,( పామిడిదగ్గర కొండాపురం అప్పుడు పార్టీకి పెద్ద యూనిట్టు) తరిమెల శ్రీరామి రెడ్డి జనాన్ని తీసుకొని వచ్చినారు. శింగనమల SI పోలీసులతో వచ్చినాడు. SI భూస్వామినే అరెస్టు చేసినాడు. వ్యవసాయకా ర్మిక కార్మికసంఘ పోరాటానికి లభించిన చారిత్రాత్మక విజయ మంటాడు రాజశేఖరరెడ్డి. నాకు తెలిసి అనంతపురం జిల్లాలో భూస్వామిని అరెస్టు చేసిండేది ఈ ఒక్క సంఘటనే. 500 ఎకరాలు ఆక్రమించినాము. వ్యవసాయ కార్మికసంఘ జిల్లాకార్యద ర్శి నేను, అధ్యక్షుడు భంగి ఎర్రిస్వామి. రాజశేఖర రెడ్డి నాయకత్వాన ఆ యేరియాలో చాలా గ్రామాల్లో భూ ఆక్రమణలు చేసి నాము. తిమ్మసముద్రం నారాయణ రెడ్డి రాజశేఖరరెడ్డికి దగ్గర బంధువు. ఆయనివి 800 ఎకరాలు ఆక్రమించినాం. రాజశేఖర రెడ్డి కార్యకర్తలతోపాటే ఒక కార్యకర్త యింట్లో అన్నం తింటున్నాడు. నారాయణ రెడ్డి అదేపనిగా మేముండే దగ్గరకు వచ్చి ఏం రాజశేఖర రెడ్డి!యింటికి పోయి భోంచేసి యివన్నీ చూసుకోవచ్చు గదా! ఏమప్పా! నేనున్నాను గదా. ఆ మాత్రం గుర్తించలేడా ? నువ్వు కార్యక్రమాలు ఏమన్నా చేసుకో అవన్నీ నాకు కాబట్టవు. నాకు చాతనైతే ఎదుర్కొంటా. లేకుంటే ఓడిపోతా.’ అన్నాడు .”లేదు చిన్నాయనా! ఈ పనులన్నీ చూసుకొని వస్తామనుకొంటి” అన్నాడు .రాజశేఖరరెడ్డి.. నారాయణ రెడ్డి ఆ భూములన్నీ వదలుకున్నాడు. రాజశేఖర రెడ్డి నాయకత్వాన ఆ ఏరియాలో జరిగిన పోరాట ఫలితమది. ఆత్మకూరు మండలం లోని పడమట యాలేరులో క్రైస్తవులు ఎక్కువ. వాళ్ళంతా మేధావులు. MA, BA లు చదివినవాళ్ళు. మా బృందం మీటింగు పెడితే ‘కమ్యూ నిజం ఈ దేశానికి కొత్త. కమ్యూనిజం ఈ దేశాన్ని ఎట్లా అభివృద్ధి పరుస్తుంది? అని ప్రశ్నించేవారు. “క్యాపటలిజం ఈ దేశానికీ కొత్త. దేశంలో మనగలుగుతోంది కదా! క్రైస్తవం ఈ దేశానికి కొత్త.మీరంతా క్రైస్తవ మతం తీసుకున్నారు కదా!” అని మేం జవాబిచ్చేవాళ్ళం.‘ ఓనమాలు రాకపోయినా ఈ కమ్యూని స్టులతో వాదించలేము” అనుకొం టూ MA, BA లు వెళ్ళిపోతారు.
1955 ఎలెక్షన్ ప్రచారానికి పోయినాము. ఆంథోనిరెడ్డి గారు మా ప్రత్యర్థి అభ్యర్థి. ఆయన సంజీవరెడ్డిగారికి చాలా ప్రియమైనవాడు. అక్కడకు పోయింది పార్టీ ప్రచార దళం. బీదల యిండ్లకాటికే పోయినాము. గోనెపట్టల మీద, పాత ఈతచాపల మీద రాజశేఖరరెడ్డి తో సహా అందరూ కూర్చున్నాము. వాళ్ళు పెట్టిన బొరుగులో, కారం బోరుగులో తినేవాళ్ళం. అప్పటికి కరెంటు రాలేదు ఆవూరికి. గ్యాస్ లైట్లు ముట్టిచ్చుకొని ఏడెనిమిది మంది రెడ్లు వచ్చినారు. “ ఏమర్రా సంజీవులు! ఓబులప్పా! ( ముద్దలాపురం) మీకన్నా తెలీదేమర్రా? నా యింట్లో కూడుతిని, తరువాత యాడన్నా సాయండి. రేప్పొద్దున సంజీవరెడ్డి అడిగితే మాకు సిగ్గుపోదా?” అన్నారు.“ అవన్నీ ఏమీ లేదు. వీళ్ళతో మాట్లాడి వస్తామనుకోయింటి ఓట్లడిగేకి. మీరు ఓట్లు వేయరు. అయినా అడిగే ధర్మం వుంది కదా!” అని రాజశేఖర రెడ్డి జవాబు. నిష్టురమెందుకు? అక్కడికే పోదామం టే “సంజీవులు! నువ్వూరుకో. మనం యెక్కడికి పోవల్లనో ఆటికే పోవల్ల.వాళ్ళ దగ్గర నువ్వు తినకపోయినా నేను తింటానప్పా. బొరుగులు పెట్టనీ కారాలు పెట్టనీ.” అనేవాడు. అట్లా ఈయన పేదవాళ్ళ యింట్లోనే కూర్చోనేవాడు. పేదవాళ్ళు పెట్టిందే తినేవాడు.
రాజశేఖర రెడ్డిగారు గొప్ప మార్క్సిస్టు తత్వవేత్త. ఏ మాట మాట్లాడినా థియరిటికల్ గానే మాట్లాడుతాడు. ములాజు లేదు. మా పూలకుంట శాఖలో నాకు ఇంకో కామ్రేడ్ కు తగాదా వచ్చింది. ఆ కామ్రేడ్ మంచి ఉపన్యాసకుడు. తాలూకా స్థాయి నాయకుడు. గ్రామ శాఖ ఆయన్ను తీసేసింది.. అయన జిల్లా పార్టీకి అపీలు చేసుకున్నాడు. ఒక జిల్లా నాయకుడు వచ్చినాడు. శాఖ రిపోర్టు విన్నాడు. తొలగించిన కామ్రేడ్ వాదన విన్నాడు. ఏమి చెప్పకుండానే వెళ్ళాడు. ఆ కామ్రేడ్ ను తీసివేస్తే ఆ ఏరియా లో కమ్యూనిస్టుపార్టీ ఎట్లా బలపడుతుంది? సంజీవులు యాడ నిర్మిస్తాడు? అని వాదించినాడు. అప్పుడు రాజశేఖరరెడ్డి ‘ అంటే నువ్వు మార్క్సిజం ఏం చదువుకున్నావ్? పార్టీ నిర్మాణానికి కార్మిక వర్గం తరము కాదా? భూస్వాములే ఆకర్షిస్తారా? వట్టి ఆక ర్షణ కాదు.ఉద్యమాలు కావల్ల. ప్రజలు తమంటకు తాము పోరాటాలు చేసుకోవల్ల” అన్నాడు. నేను జిల్లా కమిటీ సభ్యుణ్ణి. పూలకుంట శాఖతీర్మానాన్నే జిల్లా కమిటీ ఆమో దించింది. అదీ రాజశేఖరరెడ్డి అంటే.
రాజశేఖర రెడ్డి గారు, నేనూ రాత్రిపూట ఆత్మకూరు మండలం,పడమట నారాయణపురం పోతున్నాం నడుచుకుంటూ. శివాయిజమా పోరాటం జరుగుతున్న కాలం.1952 నాటి మాట యిది. ఇద్దరే పోతున్నాము. అక్కడినుంచి ఇద్దరో, ముగ్గురో వస్తున్నారు.చీకటి సరిగా కనపడరు. మమ్ముల చూసి వాళ్ళు నిలబడినారు. మేమూ నిలబడినాం. ఎట్ల వాళ్ళతో సంప్రదింపు లు జరిపేది? ‘ సంజీవులూ!’ అనె. ‘ ఏం రాజన్నా!’ అంటి. ‘ ఓ పాట పాడప్పా!’ అనె. పాట అందుకుంటి. పాట అంటే పార్టీ పాటనే. పాడతానే ‘ ఒరే! మన కమ్యూనిస్టు పార్టీ వాల్లురా!’ అని దగ్గరకు వచ్చేసిరి. అక్కడ ఉద్యమముంది. పైగా శివాయిజ మా ఉద్యమం బలంగా వుంది. ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేయించిననాం. ఆ కాలంలో దాదాపు 400 ఎకరాలు పంచినాం కడదరకుంట, కరుట్లపల్లి, నారాయణపురం మొదలగు గ్రామాల్లో.
కల్యాణదుర్గం యేరియాలో 16వేల ఎకరాలు చట్టం రాకుండానే పార్టీ పంచింది.. భంగి ఎర్రిస్వామి, భంగి రామప్ప, తుపాకుల రాముడు వీళ్ళంతా మహా వీరులు. 1954 కర్నూలుకు పెద్దఆకలి యాత్ర చేసినాం. కల్యాణదుర్గం, అనంతపురం తాలూకాల నుండి జనం ఎక్కువ మంది వచ్చినారు. పోలీసులకు కార్యకర్తలకు పెద్ద ఘర్షణ. గుంతకల్లులో లాఠీఛార్జి జరిగిం ది.రైలు ఎక్కడం, దిగడం. గొలుసు లాగడంఎట్లో కర్నూలు చేరుకున్నాం. బ్రహ్మాండమైన ప్రదర్సన. ఊరేగింపు తరువాత సభ. ప్రకాశంపంతులు గారు ముఖ్యమంత్రి. సంజీవరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి. “ ఏది ఏమైతేనేమి? కుటుంబానికి ఐదెకరాలు పంచుతాము. నాగిరెడ్డిగారూ మీరు యింటికి వెళ్లిపోవచ్చు.” అన్నాడు ప్రకాశంపంతులుగారు.
1940 - 41 ల నుండి సదాశివన్, రాజశేఖర రెడ్డి గార్లతో నాకు పరిచయం. అయితే వి.కె.గారితో 1942 ఆగస్టు లో సబ్ జైలులో పరిచయం. మన్నీల దగ్గర రైలు పట్టాలు పీకినారని కేసు మోపి నన్ను, మోదీన్ సాబ్, నరసింహారెడ్డిలను తెచ్చి సబ్ జైలులో పెట్టినారు. కాలేజి ల్యాబ్ దహన కేసులో వి.కె. గార్ని జైల్లో పెట్టినారు. సదాశివన్ గారు, రాజశేఖర రెడ్డిగారు, మాల్యవంతం వెంకటరెడ్డి గారు, కె.ఎస్.రాఘవాచారిగారు కూడా అదే జైలులో వున్నారు. వేరే కేసుల్లో లోలూరు ఎల్.బి. శాస్త్రి, శివశంకర్ వున్నారు. అదే వీకేతో మొదటి పరిచయం. మా యిద్దరికీ సంధాన కర్త జి.రామకృష్ణ . ఆయనే వి.కె.గారు యిచ్చే పుస్తకాలు సాహిత్యం అందజేసేవాడు.
సబ్ జైలులో పరిచయం తరువాత వారానికి రెండు సార్లన్నా పూలకుంట నుండి నడచిపోయి వి.కె.గారిని చూసి వచ్చే వాన్ని. అనేక పుస్తకాలు యిచ్చేవాడు. అనేక విషయాలు చెప్పేవాడు. జిల్లా జాతీయోద్యమంలో పాల్గొన్న మాలాంటి యువకుల
ను సమీకరించి నెలకొక్కసారన్నా రాజశేఖర రెడ్డి గారింట్లో తరగతులు పెట్టించేవాడు. తరిమెల నాగిరెడ్డి గారు, ఐదుకల్లు సదా శివన్ గార్లు టీచర్లుగా ఈ తరగతులు నిర్వహించేవారు యిపుడు వి.కె.గారున్న యిల్లు ఒకప్పుడు ఠాగూర్ లాడ్జ్ గ వుండేది. అక్కడ స్టడీసర్కిల్స్ నిర్వహించేవారు. వి.కె. గారు ఈ యన్నిట్లో చాల చురుకుగా పాల్గొనేవాడు. వి.కె.గారు మా వయసు వారి కందరికీ చాల ప్రీతిపాత్రుడు. చాల ఆప్యాయంగా మాట్లాడుతాడు. నిదానము, నిబ్బరంగా వుంటాడు.అందరినీ ఆకర్షించే శక్తి ఆయనలో వుంది. మంచి మాటలతో, మంచి పద్ధతులతో ఎవరికి ఏ సహాయం చేయాలన్నా చేసేసేవాడు. అందువల్ల మా లాం టి యువకులందరికీ వి.కె. అంటే ఆకర్షణ.
ఒకసారి ప్రసన్నాయ పల్లెలో కలరా వచ్చింది. 1943లో. పరసన్నాయపల్లె మా అమ్మ పుట్నిల్లు. నేను కొంతకాలం అక్కడే పెరిగినాను. కలరా వచ్చిన సంగతి తెలిసి పూలకుంట నుంచి నడుచుకుంటూ పరసన్నాయపల్లె చేరినాను. అప్పటికే వి.కె. గారు పదిమంది విద్యార్థులతో చేరుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ ఊరిలో నా స్నేహితుడు వై.నాగిరెడ్డి,నేనూ పాల్గొన్నాం. వీధులన్నీ వూడ్చినాం పరిశుభ్రతపై అవగాహన కల్పించినాం. ఈ కార్యకలాపాలు చూసి రైతులంతా చాలా ఆశ్చ ర్య పడినారు. వి.కె.గారిని ప్రశంసించినారు. నన్నూ, నాగిరెడ్డిని కూడా ప్రశంసించినారు.
ఆ సంవత్సరంలోనే జి. రామకృష్ణ నాతో సభ్యత్వ దరఖాస్తు రాయించుకొని రాజశేఖర రెడ్డి గారికి యిచ్చి నాడు. రెకమెండు చేసిన వారెవరంటే సదాశివన్ గారు, జి.రామకృష్ణగారు. రెకమండేషన్ వుంటేనే సభ్యత్వం. ఆ సంవత్సరం లోనే పరసన్నాయపల్లె నాగిరెడ్డి, ముద్దలాపురం ఓబులప్ప, ఇంకా అయిదారు మందికి సభ్యత్వం యిచ్చినట్లు నాకు బాగా జ్ఞాప కం.
1943 లోనే కమలానగర్ లో 30 -35 సభ్యులతో పార్టీ సమావేశం జరిగింది. జిల్లా ఆర్గనైజింగ్ కమిటీని ఎన్నుకు న్నాము. రాష్ట్రపార్టీ నుండి ముక్కామల నాగభూషణరావు గారు హాజరైనారు. ఆర్గనైజర్ గా రాజశేఖర రెడ్డి గారిని ఎన్నుకున్నాం ఆ కమిటీలో రాజశేఖర రెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, జి. రామకృష్ణలను కమిటీమెంబర్లుగా ఎన్నుకున్నాం. 1946 లో ఉరవకొండలో జిల్లా పార్టీ ప్రథమ మహాసభ జరిగింది. దాదాపు 62 ప్రతినిధులు హాజరైనారు. అనంతపురం తాలూకా నుండే ఎక్కవమంది హాజరైనారు. రాష్ట్రం నుండి చండ్రరాజేశ్వరరావు గారు హాజరైనారు. తరిమెల శ్రీరాముల రెడ్డి, సోదన పల్లె నారాయణరెడ్డి, భంగి ఎర్రిస్వామి, తుపాకుల రాముడు, గణేనాయక్, కమ్మక్కగారి దాసప్ప, రాము, తాతినేని వెంకటేశ్వర రావు ఇలా అన్ని ప్రాంతాల నుండి యోధులంతా వచ్చినారు. రాజశేఖర రెడ్డిగారిని కార్యదర్శిగా ఎన్నుకొన్నాం.
1945 లో ధర్మవరంలో పేరూరు ప్రాజెక్టు మహాసభ జరిపింది పార్టీ. గాడిచర్ల హరిసర్వోత్తమరావు వచ్చినారు. పల్లెం శ్రీనివాసులు గారు బాగా సహాయపడినారు. శ్రీనివాసులు గారు, సదాశివన్ గారు మంచి దోస్తులు. ఆ సభ కోసం పల్లెలు తిర గాల్సివుంది. వి.కె.ను నన్నూఒక దళంగా వేసినారు. రెండు సైకెండ్లు యిచ్చినారు. ఏ సభలు జరిపినా మేమిద్దరం ఒకటే దళం. నేనే ఎందుకంటే నేను బాగా పాటలు పాడుతాను కాబట్టి.పాటలు విన్న జనం బాగా వస్తారు. ఆ కిటుకు ఆయన కు తెలుసు. జాతీయ గీతాలు పాడేవాణ్ణి. గురజాడ అప్పారావు గీతాలు పాడేవాన్ని. పదండి ముందుకు, పదండి ముందుకు తోసుక పోదాం పైపైకి వంటి మహాప్రస్థానం గీతాలు పాడేవాన్ని, కొన్ని నా స్వంతపాటలు పాడేవాన్ని. నేను బాగా పాడేవా న్ని.గొంతు బాగుండేది. నేను రచ్చకట్ట మీదో, దేవలంముందో నిలబడి పాడుతూవుంటే ఊరు ఊరంతా వచ్చేది. అబద్దం కాదుసార్! నిజం. దాని కోసం వి.కె.గారు అదేపనిగా నన్నే ఎంచుకొంటాడు. నాకు సంజీవులే కావల్ల అనేవాడు. రాజశేఖర రెడ్డి కూడా పోట్లాడేవాడు నా కోసం.
బుక్కపట్నంలో 1945 మే లో జిల్లా రైతు సంఘ మహాసభ జరిగింది. సభకు రాష్ట్రం తరఫున సుందరయ్యగారు వచ్చినారు. మిక్కిలినేని రాధాకృష్ణగారు బుర్రకథ చెప్పడానికి వచ్చినారు. చెరువుకింద పెద్ద పెద్ద పందిర్లు వేసినారు. జిల్లా నలుమూలల వుండే కార్యకర్తలంతా వచ్చినారు. దాదాపు జనం ఐదువేలమంది వచ్చింటారు. కార్యకర్తలు 150మంది వచ్చి నారు
మహాసభల ప్రచారం నిమిత్తం సదాశివన్ గారు మూడుదళాలు వేసినాడు. వెంగళమ్మ చెర్వు లక్ష్మినారాయణ రెడ్డి , నీలం రాజశేఖర రెడ్డి, వి.కె.ఆదినారాయణ రెడ్డి దళ నాయకులు. సంజీవులు నాకు కావల్లంటే, నాకు కావల్లని రాజశేఖర్, వికె.ల మధ్య పోటి. ఆఖరకు వి.కె.జతకే నేను . ఎందుకంటే మొదటినుంచి వి.కె. జతగాడు.రాజశేఖర్ నాకంటే పెద్దోడు, గురు వు. సమానంగా మాట్లాడేకి వుండదు. వికె తో అయితే అన్ని మాట్లాడుకోవచ్చు. తమాషాలు పడవచ్చు.
వికె. చానా చొరవ వున్న మనిషి. కుంటిమద్ది, దాని చుట్టుపట్టు పల్లెలకు పోదాం అంటాను నేను . అక్కడ జాతీ యోద్యమం వున్న పల్లెలవి. తెలిసినవారుంటారు అని నా అభిప్రాయం. కాదు కొత్తపల్లెలకు పోదాం అంటాడు వికె. ఎక్కడికి పోదాం అంటే మేడాపురం పోదాం అన్నాడు. మేడాపురం, గుంటికొండ, ఓబులాపురం, నాగసముద్రం, దామాజిపల్లి – ఈ యేరియాకు పోదాం అన్నాడు. అక్కడ మమ్మల్ని మాట్లాడించేనాథుడు లేడు. పళ్ళెం శ్రీనివాసులు రెండుసైకెండ్లు తీయించినా డు. మొట్టమొదట మేడాపురంలో మీటింగు పెట్టినాం. నేను పాట పాడితే వూరంతా వచ్చింది. మహాసభ గురించి మాట్లాడి నాం. ఎనిమిది గంటలకు తిరిగి బయలుదేరినాము . అక్కడ ఒక సత్యాగ్రాహి ఉన్నాడు. విశ్వనాథం అని ఆయన పేరు. మా వయస్సు వాడే. ఆయన కనుక్కున్నాడు మమ్ముల . మా యందర్నీ కలిపే పత్రిక యేది అంటే సాధన. పప్పూరు రామాచార్యుల సంపాద కత్వాన వచ్చేది. జాతీయోద్యమంలో పాల్గొనేవాళ్లు ఏ మూల వున్నా వారి పేర్లు ఆ పత్రికలో వచ్చేవి. మేం జైళ్లో వున్నాము కదా. మా పేర్లు ఆ పత్రికలో వచ్చేవి. ఆయన తనను పరిచయం చేసుకొని భోంచేసే పోవల్ల అన్నా డు. అక్కడి నుంచి దామాజిపల్లి, నాగసముద్రం మొదలైన పల్లెలకు పోయినాం.
అట్లా కొత్త ప్రాంతాలకే పోదాం అంటాడు వికె. ప్రజలపట్ల మంచి విశ్వాసం వికె గారికి. కార్యక్రమాన్ని పవిత్రంగా భావించేవాడు. ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే నెరవేరుద్దాం అంటాడు. కొత్త అయితేనేం మనం పాటలు పాడితే ప్రజలు వస్తారు. మీటింగు పెడతాం. ఎవరో ఒకరు అన్నం పెడతారు సంజీవులూ! అంటాడు. అంత విశ్వాసం ప్రజల పట్ల,ప్రజా కార్య క్రమాల పట్ల. జనం అంటే పడిచస్తాడు.
పాముదుర్తి కల్లా పోదాం అంటాడు వికె. ఆ పాముదుర్తి రెడ్లతో కష్టం. అసలు బ్రిటీషు ప్రభుత్వమే వాళ్ళను జిల్లా విడిచి పొమ్మని ఉత్తర్వులు జారీ చేసింది. వికె కు నేను ఒక షరతు పెట్టినాను. పాముదుర్తి యేరియాకు పోదామంటు న్నావ్. నే నొస్తాను. కానీ అక్కడ మాత్రం రెడ్లను గురించి నీవు పేరెత్తకూడదు. బయపరెడ్డి యిట్ల, యింకో రెడ్డి యిట్లా అంటే నేను మాత్రం రాను. అట్ల నువ్వు ఉంటానంటేనే నేను యెల్లబారుతా అనే షరతుపై బయలుదేరినాము. నాకు భయమెక్కువ. వికె గారికి ధైర్య మెక్కువ. పాముదుర్తి రెడ్లు, తరిమెల రెడ్లు, చీమలవాగుపల్లె రెడ్లు రక్తబంధువులు. పాముదుర్తి వారికి వికె గారెవరో తెలుసు. చీమలవాగుపల్లె రైతు ‘ధనిక రైతు, నిజాయితీ రైతు, బాగా కష్టపడి పని చేసే కుటుంబం’ అని తెలుసు. కానీ వికె. మానవ సంబంధాలను ప్రజా సమస్యల దృక్పథంతో చూస్తాడు తప్ప, బంధుత్వాల వరసలతో కాదు. మాట్లాడుతా మాట్లాడుతా తిట్టిన తిట్టు తిట్టకుండా రెడ్లను తిట్టి పారేస. సభ అంతా నిశ్శబ్దం. మీటింగు తరువాత భోంచేసి పొమ్మని మనుషులతో చెప్పంపినా డు బయపరెడ్డి. మేము పో లేదు. మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. అగ్రహారం లో తినల్లని. అగ్రహారంలో బ్రాహ్మణులు వున్నారు. సూర్యనారాయణ, నరసింహారావు వున్నారు. వీళ్ళు ఎప్పుడూ రెడ్లకు వ్యతిరేకం. రాత్రి అగ్రహారంలోనే వుండి, పొద్దు న్నే గూనిపల్లి, సిద్దరాంపురం వచ్చినాము.
పాముదుర్తి అంటేనే సదాశివన్ గారు గుర్తుకొస్తారు నాకు. 1937 జిల్లాబోర్డు ఎన్నికలలో కల్లూరు సుబ్బారావు గారు నిలబడినారు. ప్రత్యర్థి పాముదుర్తి రెడ్డి. కల్లూరు సుబ్బారావు అంటే కాంగ్రెసు తరఫున ప్రచారం చేయడానికి సదాశివన్ గారు పాముదుర్తికి వచ్చినారు. మీటింగు పెట్టి బాగా వాయించినాడు. రెడ్డి మనుషులు సదాశివన్ పై దుమ్మెత్తిపోసినారు. కండ్లలో పడిన దుమ్ము తుడుసుకొని సత్రంలో పడుకున్నారు సదాశివన్ గారు. పొద్దున్న లేచి చూస్తే తలపాటున పెట్టుకున్న సంచి లేదు. నేరుగా రెడ్డింటికి పోయినాడు. నా సంచి పోయింది. మీరు చెబితే సంచి వస్తుంది అన్నాడు. “ ఎవరో పిల్లనాయల బాగొచ్చినావు! వచ్చి తిట్టింది కాక, సంచి పోయిందని నా మీదకే వచ్చినవా?” అన్నాడు రెడ్డి. “ లేదండి రెడ్డిగారూ! మీరు చెప్పితే సంచి వస్తుంది.మీ వూర్లో మీకు తెలీ కుండా యా దొంగ వుంటాడు? తెప్పించండి.” అన్నాడు. “నాకు సాధ్యం కాదు” అన్నాడు రెడ్డి. సరే ఏమన్నా చేసుకో! మా గాంధీ గారు చెప్పినట్లు సత్యాగ్రహం చేస్తాను” అని వాకిట్లో కూర్చున్నాడు. పది నిముషాల్లో బ్యాగ్ వచ్చింది. అట్లా జరుగు తుందేమో నని భయం. పిల్లోన్ని ఈదలాడేకి బాయిలోకి దిగమంటే దిగను దిగను, భయం భయం అంటాడు. ఈత నేర్పించేవాడు మునగబెండ్లు కట్టి దిగొద్దులే దిగొద్దులే అంటూనే బాయిలోకి నూకుతాడు. పిల్లోడు రెండు అరుపులు అరిచి, రెండు మునక లు మునిగి తరువాత నిర్భయంగా ఈదలాడుతాడు. అట్లా ఈ సంఘటనతో నా భయాన్ని పోగొట్టినాడు వికె. ఆయన ప్రత్యేకత ఏమంటే ఆ రెడ్ల సంగతేమిటో చూద్దాం! ఆ దౌర్జన్యపరుల సంగతేమిటో చూద్దాం !అంటాడు. అట్లా చోటికే డ్యూటీ వేసుకుంటాడు. సులభంగా వుండేచోటికి పోడు. ఆయనలో వుండే గొప్పతనమే అది. కొత్త ప్రాంతాలకే పోదాం, పెద్ద వాండ్లనే ఢీకొడదాం, ప్రజలను చైతన్యం చేద్దాం అంటాడు వికె.
ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీని నిషేధించలేదు గాని, నాయకులందరిపైన అరెస్టు వారంట్లు జారీ అయినాయి. కమ్యూ నిస్టు పార్టీ ఆర్గనైజేషన్ పధ్ధతి కూడా మార్చింది. ఉరవకొండ,కళ్యాణదుర్గం, అనంతపురం,గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి, తాలూ కాల నిర్మాణం వికె గారికి అప్పగించబడింది.పెనుగొండ, ధర్మవరం, గ్యాదిగకుంట,కదిరి, బుక్కపట్నం వగైరా ప్రాంతాల నిర్మా ణ బాధ్యత సదాశివన్ గారికి అప్పగించబడింది.
వీకే 1948 మార్చిలో మా గ్రామాలకు రహస్యంగా వచ్చేవాడు. ఉప్పరపల్లి రెడ్లకు వ్యతిరేకంగా, దుర్గం భూస్వాము లకు వ్యతిరేకంగా, పూలకుంట, చియ్యేడు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించినాము. జూన్ లో రహస్యస్థావ రం నుండి పరసన్నాయపల్లి నాగిరెడ్డితో ఒక లెటర్ పంపినాడు వీకే. సంపూర్తిగా బయట వుండవద్దని, సెమీ లీగల్ గా వుండ మన్నాడు. డి.నాగిరెడ్డి, సత్తారు, కూరపాటి రాముడు(రామిరెడ్డి), కిష్టప్ప (కృష్ణారెడ్డి)- వీళ్ళంతా బయటే వున్నారు. వికె.గారి రహస్యస్థావ రం చియ్యేడు కూడా. చియ్యేడులో వికె,గారి భార్య పార్వతమ్మ గారి దగ్గర బంధువు ఒకామె వుండేది. ఎవరికీ తెలీదు. ఆమెకు తెలుసు, మా యిద్దరికీ తెలుసు. నా స్థావరం ఎక్కువగా దుర్గం కొండలు, కృష్ణమరెడ్డి పల్లి. మా మధ్య కొరి యర్లు వుండేవారు. కొరియర్లు గట్టిగా వుండల్ల. పట్టుకొని కొట్టినా ఏమీ చెప్పకూడదు. చాకల ఓబులేసు ( పూలకుంట), కృష్ణా రెడ్డి(చియ్యేడు) కొరియర్లుగా వుండేవారు.
వికె. సమయస్ఫూర్తి చాలా గొప్పది. నేను ఆయనతో కలిసి రాత్రిపూట పూలకుంట నుండి సోదనపల్లెకు పోతాండాము దాదాపు 30 కి.మీ.వుంటుంది. నడుచుకుంటూ పోతున్నాం. దాదాపు రాత్రి 1.30 గం. అయింటాది. చెన్నంపల్లి దగ్గరకు చేరు కున్నాం. చెన్నం పల్లికి కొండలకింద పోవల్ల. వెన్నెల బాగా వుంది. దావ వారనే పెద్దబండ వుంటే దానిమీద ఇద్దరం కూర్చుం టిమి. అక్కడ దక్షిణాది నుంచి ఐదు మంది పెద్ద పొట్లి ఎత్తుకొస్తున్నారు. వాళ్ళు మాకు కనపడతా వున్నారు. మేమూ వాళ్లకి కనపడుతూ వున్నాము. వికె.పంచ ఎగ్గట్టి ఏదో ఆఫీసరు మాదిరి వుంటే పోలీసులనుకున్నారు మమ్మల్ని. “ ఎవరు మీరు?” అనిరి. మేము పలకలేదు. పలక్కపోతే రాళ్ళు వేసిరి. నేనేం చేస్తి నంటే ‘వీకే ! పిస్తులు తీ. పైకి కాల్చు’ అంటి. ఊరుకో కాల్చకూ డదు అని, నీ పేరు ప్రకటించుకో, ప్రకటించుకో అనె. అంటే నేను ఆ యేరియావాన్ని కదా. ఆ సమయస్ఫూర్తి అట్లాంటిది. నేను సంజీవుల్ని, కమ్యూనిస్టును అంటి. ఆ ఐదుమందిలో ఎవడో ఒకడు మా వాడున్నాడు. వడ్డేవాడు. “ నువ్వు కమ్యూనిస్టువి కదా! మావాడివి కదా! అని కులం పేరుతొ పిలిచినాడు. అవునర్రా! యిట్లా రా! అంటి. అప్పుడు వారొచ్చి పరిచయం చేసుకుండ్రి. అంత సమయస్ఫూర్తి ఆయనిది. ఎందుకు చెప్తున్నానంటే ఎంత వ్యతిరేక పరిస్థితుల లోనూ, అత్యవసర పరిస్థితులలోను గాబరా పడకుండా బెదిరి పోకుండా తెలివితేటలు ఎట్లా ప్రయోగిస్తాడో అనేది చెప్తున్నా. పిస్టలు కాల్చడం తప్పు. పిస్టలు కాల్చితే ఈయేరి యాలో కమ్యూనిస్టులు తిరుగుతూ వున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది. అందువల్ల నీ పేరు ప్రకటించుకో అన్నాడు. ఎందుకంటే నేను ఈ యేరియావాన్ని. అందరికి తెలుసు. గొప్ప విపత్తులో సమయస్ఫూర్తికి వీకే పెట్టింది పేరు.
నేను జైలుకు పోయినపుడు నా కుటుంబాన్ని గడ్డకేసింది వీకేనే. కామ్రేడ్ ఫణిభూషణ్ తో( తరిమెల కామ్రేడ్) డబ్బు పంపేవాడు. నాకే కాదు చాల మందికి సహాయ పడినాడు. ఈ విషయాలు తను చెప్పడు. మమ్మలా ప్రచారం చేయొద్దంటాడు. వికె. నిరంకుశత్వాన్ని సహించడు. అనంతపురం తాలుకాలో దాదాపు 20 గ్రామాల్లో పెత్తందార్లకు వ్యతిరేకంగా వికె. నాయక త్వాన పోరాటాలు జరిగినాయి. ఐదుమంది కామ్రేడ్స్ చంపబడ్డారు. పెద్దపోరాటాలు సాగిచ్చినాము. జయప్రదం అయినాము. నా వాడు, తనవాడు అనే తత్త్వం వీకే కు లేదు.1967-77 వరకు అనంతపురం తాలుకాలో పెత్తందార్ల వ్యతిరేక పోరాటాలు చేసినాం. తోపుదుర్తి, పూలకుంట, చియ్యేడు, కృష్ణమరెడ్డిపల్లి, కందుకూరు, జంబులదిన్నె, ముంటిమడుగు, తరిమెల, కురు గుంట – యిలా దాదాపు 18 గ్రామాల్లో భుస్వామిక వ్యతిరేక పోరాటాలు చేసి, అక్కడి ప్రజలకు ప్రజాస్వామిక హక్కు కల్పిం చడంలో – రక్తపాతం జరిగినా – విజయం సాధించినాం. అందులో వికె.గారు రాత్రింబవళ్ళు పని చేసినాడు. శత్రువు మీద పడతాడు, బాంబులేస్తాడు అన్నా ఊర్లోకి పోకుండా పోయింది లేదు. ఊరిపక్క చేండ్లలో సమావేశాలు జరిపేవారం. వాళ్లకు మంచి చెడ్డలు చెప్తూ పోరాట పటిమలు నేర్పినాము. మొత్తం మీద పేదవాళ్ళ పోరాటాలన్నీ జయప్రదం అయినాయి
పార్టీ చీలిక తరువాత వికె.గారు పెద్ద బాధ్యత మోసుకున్నారు. మొత్తం జిల్లా అంతటా పార్టీ ఎక్కువ భాగం నాగిరెడ్డి వెంట, CPM వెంట పోయింది. నాగిరెడ్డి గారు నాతో చర్చించినారు. నేను CPI లోనే కొనసాగుతానన్నాను. అనంతపురం తాలుకాలో పూలకుంట, కృష్ణమరెడ్డిపల్లి, చియ్యేడులో సగం, కక్కలపల్లి శాఖ మా వైపున్నాయి. అంతా కొట్టుకపోయారు. “వికె, సదాశివన్ తప్ప ఎవరున్నారప్పా మీకు?” అని మమ్మల్ని తక్కువచేసి మాట్లాడేవారు. ‘సైన్యం మా కల్లా. నాయకత్వం మీ కల్లా” అనేవారు CPM వారు. ఆ పరిస్థితులలో నిలబడటం, పార్టీని నిలబెట్టడం అంత సులభం కాదు. వికె. మేరుపర్వ తం లాగా నిలబడినాడు కమ్యూనిస్టుపార్టీకి.
సోదనపల్లె, జంబులదిన్నె, తరిమెల – వీళ్ళంతా దగ్గర బంధువులు వీకే కు. దగ్గర బందువైనా సహించేవాడు కాదు వికె. ఆయనలో గొప్పతనం ఏమిటంటే మనలాంటి వాళ్ళు పోతే ఆయనే కుర్చీలు వేసేవాడు. కాఫీలు తెచ్చిచ్చేవాడు. ఎమర్జన్సీ పీరియడ్ లో బొందలేడు భూస్వాములతో పెద్ద పోరాటం చేస్తున్నాం. ప్రామిసరీ నోట్లు అన్నీ తెప్పించి చించి వేయించినాం. ఆ పోరాటంలో సదాశివన్ గారు, నేనూ ఎక్కువగా కనపడ్డాము. నేను ఒకసారి పోతే భూస్వాములు గుర్తించలేదు. మాకు సదాశి వన్ గారున్నారు, వీకే గారున్నారు. నీ మాట వినెల్లేదు అన్నారు. ఆ భూస్వాములు ఏడెనిమిది మంది జీపులేసుకొని వీకే దగ్గరకు వచ్చినారు. నేను పోయేవరకూ సమావేశం మొదలు పెట్టలేదు వికె. నేను పోగానే నాకోసం కుర్చీ తీసుకొచ్చి వాళ్ళ మధ్య వేసినాడు వికె. వాళ్ళు నన్ను గుర్తించల్ల కదా!
వికె. ప్రజాస్వామిక వాది. శత్రువును ఉద్యమాల ద్వారా దెబ్బతీయాలనే చూస్తాడు. రహస్య రోజుల్లో అంతే, బయటి రోజుల్లో అంతే. కేవలం మనకు అపాయమైనపుడు వాని పీడ వదలించుకుంటాం గాని, ఉద్దేశ్యపూర్వకంగా మనం హింసావాదులం కాకూడదు అనేవాడు. తాడిపత్రిలో దివాకర రెడ్డికి వ్యతిరేకంగా చేసిన పోరాటం చాల గొప్పది. నా అను భవంలో రాయలసీమలో అంతమంచి పోరాటం జరగలేదు. ప్రజాస్వామ్యం కోసం పోరాటం. అన్ని శక్తుల్ని కలుపుకొని కర
పత్రాలు,వాల్ పోస్టర్లతోనే పోరాటం. అంతే కాని ఒక బాంబు వేయలేదు మనం. అనంతపురం నుండి ఢిల్లీ దాకా వాల్ పోస్టర్ల ప్రచారంతోనే మనం ఆయన్ను ఓడించినాం. పి.వి. నరసింహారావుగారు ప్రధానమంత్రిగా వున్నపుడు, విజయభాస్కర రెడ్డిగారు ముఖ్యమంత్రిగా వున్నపుడు అనంతపురంలోనే ఎక్కడో కలిసినారు వీళ్ళు. “ తాడిపత్రిలో, ధర్మవరంలో , పెనుగొండలో ప్రభు త్వం ఉందా?” అని అడిగినాడు వికె గారు విజయభాస్కరరెడ్డి గారిని. దానికి ఏమి సమాధానం చెప్తాడో అని విజయభాస్కర రెడ్డిగారిని చూస్తున్నారు పి.వి. గారు. దానికి విజయభాస్కరరెడ్డి గారు ఏమీ సమాధానం చెప్పలేక పోయినారు. ఈ దెబ్బతోనే దివాకరరెడ్డిగారిని మంత్రిపదవి నుండి తీసేసిరి. నిజంగా ప్రజాస్వామిక ఉద్యమమంటే అదే ఉద్యమం. అన్ని పార్టీలను, తెలుగు దేశం వారిని, యింకా కలిసి వచ్చే ప్రజాస్వామిక శక్తులన్నిటిని కలుపుకున్నాడు. ఎవర్నీ కూడా నువ్వు రావద్దు అని చెప్పలేదు విజయం సాధించినాము.
తెలంగాణా సాయుధపోరాట కాలంలో ఆయుధాల కోసం రాష్ట్ర పార్టీ పిలుపిచ్చింది. ఆస్తులమ్మి యివ్వండి అని. అప్పటికప్పుడు వికె.గారు 40 ఎకరాలు అమ్మి పార్టీకి యిచ్చినాడు.నేను కూడా ఉడతకు ఉడతా భక్తిగా నా పెండ్లాం కమ్మలు తీసి యిచ్చినాను. ఉద్యమం జయప్రదం కావాలని ఆ పని చేసినాను. ‘ ఆ దరిద్రునికి యివన్నా వద్దా?’ అని తరిమెల నాగిరెడ్డి గారు కమ్మలు వాపసు పంపినాడు.
పార్టీ కార్యకర్తలపట్ల అయన చాల జాగ్రత్తగా, ఆప్యాయంగా వుంటాడు. కార్యకర్త చెప్పేది చాల ఓర్పుగా వింటాడు. కార్యకర్తల్ని కసురుకోడు. నడవడిక సవరణ విషయంలో కార్యకర్తకు ఏమన్నా చెప్పాల్సి వస్తే అతని సన్నిహితులతో చెప్పిస్తాడు కార్యకర్తను వదలుకోడు. మరీ మితిమీరితే తీసేసేదాంట్లో మొట్టమొదటివాడు ఆయనే. క్రమశిక్షణ విషయంలో ఎవరినీ లెక్క పెట్టడు.
వికె.కు చట్టపరంగా పదెకరాల భూమి ప్రభుత్వం నుండి పొందవచ్చు. ‘భూమి యాడన్నా చూడు. పార్టీకి యిద్దాం సంజీవులూ!’ అన్నాడు. మన్నీల దగ్గర చూసినాను. అప్పటి ధరలో రెండు లక్షలు వస్తుంది. అప్లికేషను MROకు యిచ్చినాను కూడా. కాని, వికె. నే నన్ను పిలిచి ‘ ఎందుకులే సంజీవులూ! కమ్యూనిస్టుపార్టీకేమో లాభమే. కాని ఆ భూములు పోగొట్టుకొన్న వాళ్ళు తిట్టుకుంటారు ఈ వికె మా భూములు లాక్కున్నాడని. యాడన్నా వసూలు చేసి పార్టీ కిద్దాం లే!’అన్నాడు.
మేము 1942 నుండి ఈ యేరియాలో కలసిమెలసి పనిచేసినాం. చాలా ఆత్మీయులం.1942నుండి నే నెట్లా మెలి గిండేది అంతా ఆయనకు తెలుసు. ఆయన సహవాసం లేకుండా నేను కమ్యూనిస్టు నాయకుడిని అయిండే వాణ్ని కాదు. నన్ను ప్రోత్సహించింది వీకే నే. నేను యింతవరకూ పార్టీలో వున్నానంటే వికే వల్లనే.
యింక సదాశివన్ గారి పేరు తలచుకోవాలంటే మన తనువు,మనసు పరిశుభ్రంగా వుండాలి. అప్పుడే ఆయన పేరు ఎత్తడానికి మనకు అర్హత వున్నట్లు. అనంతపురం జిల్లాలో తొలి కమ్యూనిస్టు సదాశివన్ గారే. శివాయిజమా పోరాటాలకు ఆద్యుడు ఆయనే. హరిజనులకు గొప్ప సేవ చేసినవాడు సదాశివన్ గారే. ఆయనకు తెలిసినన్ని పల్లెలు ఏ కమ్యూనిస్టు కూ తెలీ వు. కార్యకర్తలకే కాదు, వారి కుటుంబాలకు దగ్గరివాడు ఈయన. కార్యకర్తలతో ఇబ్బంది ఏర్పడితే ‘ వుండు నీ కత నాయకుని తో చెప్తా” అని ఆ కార్యకర్తల కుటుంబ స్త్రీలు బెదిరించేవారు. చెప్పిందే చేసేవాడు. విమర్శా ఆత్మ విమర్శా బాగా పాటించేవాడు శుభ్రత పాటించేవాడు. పాటింపజేసేవాడు. ఈయన MLC గావున్నప్పుడు ‘ మీ నాయకుడు అసెంబ్లీలో మేము చెవుల్లో దూది కూరుకున్నా ‘కరువు, కరువు’ అని ఆయన అరిచే అరుపులు గుయ్ మని వినపడతాయి.’ అని చెప్పేవాడు గుఱ్ఱంవెంకన్న. పుస్తకాలు బాగా చదివేవాడు. ఇంటికి పోయినవారికి ఆ విషయాలు వివరించేవాడు. కార్యకర్త స్థాయినిబట్టి చెప్పడమో, వివరిం చడమో, వ్యాఖ్యానించడమో , చర్చించడమో చేసేవాడు. పుస్తకాలు ఇచ్చి చదవమనే వాడు. తీసుకపోయిన పుస్తకాలు ఖచ్చితం గా తిరిగి తనకు చేరాల్సిందే. ఆయనకు భారతం అంటే చాల యిష్టం. శాంతి పర్వం ఆధారంగా వర్గాకలహాల గురించి చర్చిం చేవాడు. ఆంధ్రప్రభలో రోజు భారతం సీరియల్ గా వేసేవారు. దాన్ని దస్తగిరి గారితో చదివించుకొని వినడం చాలా సార్లు చూసినాను. నిరాడంబరుడు. నిగర్వి. అబద్దాలు,అతిశయోక్తులు చెప్పడు. క్రిందివర్గాలనుండి పార్టీలోకి ఎక్కువ రావాలనే వాడు. నా మొదటి భార్య చనిపోయి మూడు సంవత్సరాలు గడిచినాయి. పిల్లతో కష్టమని సదాశివన్ గారే రెండో పెళ్ళికి ఒప్పించినాడు. అయన సతీమణి రాజమ్మ గారు గొప్ప త్యాగశీలి. ఉదారం వుంది. ఇద్దరికి పెట్టమంటే నలుగురికి పెడుతుంది. అలాంటిగుణాలు ఉండ బట్టే సదాశివన్ ఇంత నాయకుడు కాగలిగినాడు. మాయట్లా కుటుంబాల ఆడవాళ్ళు పొతే, చక్కగా స్నానాలు చేయించి, తన బట్టలు కట్టబెట్టేది. మా పిల్లలను ఎత్తుకొని అట్లాడిచ్చేది. ఎప్పుడో వచ్చేదని సినిమా చూపించి పంపేది. ఇంటి సహాయకులుగా హరిజనులనే ఉంచుకోనేది. గ్రామాలనుండి కార్యకర్తల కుటుంబాలు వైద్యం కోసంవస్తే వారిని ఇంట్లోనే వుంచుకొని, వైద్యం చేయించి తృప్తిగా పంపేది. సదాశివన్ రాజమ్మ గార్లది అన్న్యోన్న దాంపత్యం, ఆదర్శ జీవితం.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------
మీకు రెండు విషయాలపై నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సి వుంది. మొదటిది అనంతపురం కమ్యూనిస్టుఉద్యమాన్ని గ్రంథస్తం చేస్తున్నందుకు , రెండోది 1970 దశకం ప్రారంభంలో కొన్ని కారణాల వల్ల స్తబ్దంగా వున్న నాలో మీరు (దస్తగిరి) అభ్యుదయ రచయితల సంఘం కార్యకలాపాల్లో ఇన్ వాల్వు చేసి ‘ కమ్యూనిస్టు చురుకు’ కలిగించినందుకు.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆధారం :-- పూలకుంట సంజీవులు గారితో ఇంటర్వ్యూ – (1) 17 మే 1994 ; (2) 21 నవంబర్ 1997
______దస్తగిరి
No comments:
Post a Comment